తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని భట్టి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందన్నారు.
బ్యాంకులతో చర్చలు
రూ.1.02 కోట్ల ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
సింగరేణి, విద్యుత్ ఉద్యోగులకు అమలు
ప్రభుత్వం చొరవతో చేపట్టిన కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమా కార్యక్రమం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, విద్యుత్ సంస్థల్లో 71,387 మంది ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 1.02 కోట్ల ప్రమాద బీమాను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
