పర్యావరణ పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రూ. 5,000 ముందస్తు చెల్లింపుతో ఈ-సైకిళ్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో “స్వచ్ఛాంధ్ర”, “స్వర్ణాంధ్ర” పథకాల కింద 5,000 ఈ-సైకిళ్లను మొదటి విడతగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సైకిళ్ల అసలు ధర రూ. 23,999 కాగా, లబ్ధిదారులు కేవలం రూ. 5,000 మాత్రమే ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.

మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా సులభంగా చెల్లించే అవకాశం కల్పించారు. ఈ ఈ-సైకిళ్లు ఒక యూనిట్ విద్యుత్‌తో సులభంగా 40 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలవు. సైకిల్ ఉపయోగించడం ద్వారా పెట్రోల్ ఖర్చు తగ్గిపోవడం, శారీరక ఆరోగ్యం మెరుగుపడటం, మరియు వాయు, శబ్ద కాలుష్యం కూడా తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ-సైకిళ్ల కోసం దరఖాస్తులను స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరిస్తారు.

ఈ పథకం ద్వారా అబ్బాయిలు, అమ్మాయిల కోసం వేర్వేరు సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రి జనవరిలో కుప్పంలో పర్యటించినప్పుడు లబ్ధిదారులకు ప్రత్యక్షంగా సైకిళ్లు అందజేయాలని భావిస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా కుప్పం ప్రాంతంలో కాలుష్య నియంత్రణతో పాటు ప్రజారోగ్యం పట్ల అవగాహన పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Posted Under AP
Editor