పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఆగ్రహం: ‘ప్రజల మధ్య విద్వేషాలు నింపొద్దు!’

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన “కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది” అనే వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇలాంటి మాటలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించిన షర్మిల, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోనసీమ కొబ్బరి చెట్లు కూలిపోవడానికి గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలపై ప్రభుత్వం పట్టింపు లేకపోవడం వల్లే సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లే కారణమని షర్మిల అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మూఢ నమ్మకాలను అడ్డం పెట్టుకుని ప్రజలను కించపరచడం సరికాదని, ఉపముఖ్యమంత్రిగా ఇది సబబు కాదని హితవు పలికారు.

కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపాలంటే, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రూ. 3,500 కోట్లు కేటాయించి ఉప్పునీటి ముప్పును తప్పించడానికి పనులు మొదలు పెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అన్నదమ్ముల్లాంటి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మళ్లీ చిచ్చు పెట్టొద్దని ఆమె సూచించారు.

Posted Under AP
Editor