తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్రంగా స్పందిస్తూ, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హిందూమతంలో కోట్లాది మంది దేవతలు ఉన్నారని, వివాహం కాని వారికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మద్యపానం చేసేవారికి ఇంకొక దేవుడు ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, కల్లు పోసి, కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు, పప్పన్నం తినేవారికి సైతం ఒక దేవుడు ఉన్నారని, మనకు అన్ని రకాల దేవుళ్లు ఉన్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై చికోటి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హిందూ దేవతలను కించపరిచేలా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి ఎన్నికలోనూ హిందువుల ఓట్లు అభ్యర్థించే ఆయన, హిందూ దేవుళ్ళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు వెంటనే రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
