హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్‌ఐ భానుప్రకాశ్‌కు చెందిన 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్ అదృశ్యం కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన భానుప్రకాశ్, సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. ఈ అప్పులు తీర్చేందుకే ఆయన తుపాకీని మొదట కుదువపెట్టి, ఆ తర్వాత రాయలసీమకు చెందిన ఓ గ్యాంగ్‌కు అమ్మేశాడనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రివాల్వర్ మిస్సింగ్ కేసు విచారణలో ఎస్ఐ భానుప్రకాశ్ పొంతనలేని సమాధానాలు ఇస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొదట తన డ్రాలో లేదని చెప్పి, ఆ తర్వాత విజయవాడలోని ఓ లాడ్జిలో మర్చిపోయానని కథ అల్లారు. హైదరాబాద్ పోలీసులు విజయవాడ వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ సహా లాడ్జి సిబ్బందిని విచారించగా, ఆయన చెప్పిన మాటల్లో నిజం లేదని తేలింది. దీంతో పోలీసులు ఆయనపై మరింత ఒత్తిడి పెంచుతున్నారు.
బెట్టింగ్ వ్యసనం, భారీ అప్పుల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఓ బంగారం రికవరీ కేసులో సస్పెండ్ అయినప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రివాల్వర్‌ను డిపార్ట్‌మెంట్‌కు అప్పగించకుండా తన వద్దే ఉంచుకోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సీపీ సజ్జనార్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసి, కేసును త్వరగా ఛేదించాలని టాస్క్‌ఫోర్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు.
