ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేపడుతున్న రెండో విడత భూసమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన తొలి విడత 54 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ నిర్మించారని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ రెండో విడతలో సేకరించాలనుకుంటున్న 20 వేల ఎకరాలు అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తల కోసమేనా అని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ రెండో విడత భూసేకరణకు వ్యతిరేకమని షర్మిల స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతోందని, ఇది రియల్ రాజధాని కాదని, రియల్ ఎస్టేట్ లూటీ అని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రపంచంలోని ఇతర నగరాలను ఉదాహరణగా చూపుతూ, ముంబై విమానాశ్రయం 1850 ఎకరాలుంటే, అమరావతిలో విమానాశ్రయానికి ఐదువేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. అలాగే, బీజింగ్, లండన్‌లలో ఒలింపిక్స్ నిర్వహించిన స్పోర్ట్స్ హబ్‌లు 150 ఎకరాలు మాత్రమేనని, కానీ అమరావతి స్పోర్ట్స్ హబ్‌కు 2500 ఎకరాలు ఎందుకని ఆమె నిలదీశారు.
మొదటి విడతలో తీసుకున్న 25 గ్రామాల రైతుల నుంచి 34 వేల ఎకరాలు, ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 54 వేల ఎకరాలు ఉన్నప్పటికీ, పదకొండేళ్లలో అమరావతికి రూపం లేదన్నారు. 217 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఒక్క కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదన్నారు. 54 వేల ఎకరాలపై వెంటనే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని, ఆ భూములను ఎవరెవరికి ఇచ్చారనే వివరాలు బహిర్గతం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
