భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన 25 రోజుల తర్వాత, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలం నేడు (నవంబర్ 27, గురువారం) న్యూఢిల్లీలో ప్రారంభమైంది. 2023లో WPL ప్రారంభమైన తర్వాత జరుగుతున్న మొదటి మెగా వేలం ఇది కావడంతో, ఐదు ఫ్రాంచైజీలు తమ జట్లను పునరుద్ధరించడానికి ఉత్సాహంగా బిడ్డింగ్‌లో పాల్గొంటున్నాయి. ఈ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లతో పాటు, కొత్త తరం అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై దృష్టి
ఈ వేలంలో పలువురు యువ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా:
-
వైష్ణవి శర్మ: భారత్ అండర్–19 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ తీసి, టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన ఈ స్పిన్నర్, బేస్ ప్రైజ్ రూ. 10 లక్షలతో వేలంలోకి వచ్చింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లకు లీగ్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా, ఆమెపై భారీ బిడ్డింగ్ వార్ కనిపించే అవకాశం ఉంది.
-
మమత మడివాళ: హైదరాబాద్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న ఈ వికెట్‌కీపర్ బ్యాటర్, సీనియర్ మహిళల టీ20లో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచింది (59.5 సగటుతో 298 పరుగులు). వికెట్‌కీపర్ బ్యాటర్లకు WPLలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈమెను పలు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
-
త్రిష: అండర్ 19 ప్రపంచకప్ 2025లో 309 రన్స్‌తో పాటు 9 వికెట్లు తీసి, ఫైనల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన త్రిష, ఈసారి వేలంలో భారీ అవకాశాలు దక్కించుకునేలా ఉంది. అలాగే ఢిల్లీకి చెందిన ఆల్‌రౌండర్ తనీషా సింగ్ కూడా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా మంచి డిమాండ్‌ను కలిగి ఉంది.
