తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయం: రాజీనామాకు సిద్ధమవుతున్న దానం నాగేందర్!

తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, వీరిలో ఒకరు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయనతో పాటు కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే)పై కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దానం నాగేందర్ బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయగా, కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్ తరపున పోటీ చేయడంతో ఆయన ప్రచారం చేశారు.

ప్రస్తుతం వీరిద్దరిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, న్యాయనిపుణులు ఇచ్చిన సలహా మేరకు దానం నాగేందర్ అనర్హత వేటు పడకముందే తన పదవికి రాజీనామా చేయడం మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సమర్పించడం, ఆమోదించడం జరిగిపోతాయని సమాచారం. సుప్రీంకోర్టు అనర్హత వేటుపై గడువును మరో నాలుగు వారాలు పొడిగించిన నేపథ్యంలో, ఈ లోపు దానం రాజీనామా చేసే అవకాశాలున్నాయి.

ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్, వీరిద్దరి విచారణ పూర్తయిన తర్వాత తీర్పు చెప్పే అవకాశముంది. అయితే, కడియం శ్రీహరి విషయంలో మాత్రం కొంత పట్టువిడుపులకు వెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, దానం నాగేందర్ రాజీనామా దాదాపు ఖాయం కావడంతో, తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఉప ఎన్నిక ఒక స్థానానికా లేక రెండు స్థానాలకా అన్నది త్వరలోనే తేలాల్సి ఉంది.

Editor