సౌదీ అరేబియాలో గుండెపోటుతో కరీంనగర్ జిల్లా వాసి మృతి

సౌదీ అరేబియాలో ఉపాధి నిమిత్తం వెళ్లిన కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు గన్నేరువరం మండలం, హనుమాజిపల్లెకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఆయన కొన్నాళ్లుగా సౌదీలోని ఒక కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ రోజు కారును పార్క్ చేసి, అందులోనే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వీరయ్యకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.

ఈ సంఘటన గమనించిన స్థానికులు, కంపెనీలోని ఇతర కార్మికులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. అయితే, వారు వచ్చి పరిశీలించే సమయానికి వీరయ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే తోటి కార్మికులు ఈ విషాద వార్తను ఫోన్ ద్వారా వీరయ్య కుటుంబ సభ్యులకు చేరవేశారు.

మరణించిన వీరయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తమ కుటుంబ పెద్ద హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వీరయ్య భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Editor