హరీష్ రావు టార్గెట్‌గా కవిత విమర్శలు: బీఆర్‌ఎస్ పాలన లోపాలు బహిర్గతం

బీఆర్‌ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత, మెదక్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జాగృతి జనంబాటు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలోని లోపాలు, ఈ ప్రాంత అభివృద్ధిలో హరీష్ రావు పాత్రపై ఆమె ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు మెదక్ ప్రజలపై భారంగా పడ్డాయని, ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ హరీష్ రావు ప్రజలకు పెద్దగా ఉపయోగపడలేదని ఆరోపించారు. “కేసీఆర్ కళ్లకు గంతలు కట్టినట్లు బీఆర్‌ఎస్ నేతలు ప్రవర్తించారు” అని కవిత వ్యాఖ్యానించారు.

కవిత మెదక్ ప్రాంతంలో పూర్తికాని పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించారు. మెదక్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విన్నపాలు చేసినప్పటికీ అవి అమలులోకి రాలేదని, మంచి ఆరోగ్య సదుపాయాలు అవసరం ఉన్న ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు. అలాగే, మెదక్ ప్రాంత రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు వేసుకున్న రైతులు సరైన నీటి సరఫరా లేక నష్టాలను చవిచూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాల వ్యాపారంలో అక్రమాలు జరిగాయని, ఈ రంగాన్ని కొన్ని బినామీలు ఆక్రమించుకున్నారని, అందులో మాజీ మంత్రి హరీష్ రావు పేరును ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

చివరగా, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందేలా సామాజిక తెలంగాణ నిర్మాణం అత్యవసరమని కవిత అభిప్రాయపడ్డారు. చిన్న కులాలకు ఇప్పటికీ చిన్న చిన్న పదవులు అందకుండా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మెదక్‌లోని పలు శాఖల్లో ఉద్యోగుల కొరత కారణంగా ప్రజలకు సేవలు ఆలస్యమవుతున్నాయని, ఖాళీ ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ పాలన లోపాలను కవిత వరుసగా బహిర్గతం చేస్తుండటం, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ అంతర్గత రహస్యాలను కూడా చెబుతారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Editor