న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ‘ఉచిత బస్సుల పథకం’ గేమ్ చేంజర్: భారత పథకాల స్ఫూర్తి

ఉచిత బస్సు పథకంతో న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ విజయం

మన దేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా అమలువుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం స్ఫూర్తితో, అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) విజయం సాధించారు. ఈ పథకాన్ని అందరికీ వర్తించేలా హామీ ఇవ్వడం మామ్దానీని నగర ప్రథమ పౌరుడి స్థానంలో కూర్చోబెట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉచిత పథకాలకు అమెరికన్లు సైతం పట్టం కడతారని ఈ ఎన్నిక తేల్చి చెప్పింది. మామ్దానీ డెమొక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థిగా గెలుపొందారు.

ఎలక్షన్ గేమ్ చేంజర్‌గా ‘ఫాస్ట్ అండ్ ఫ్రీ బస్సులు’

మన దేశంలో శక్తి పథకం (కర్ణాటక), మహాలక్ష్మి పథకం (తెలంగాణ), స్త్రీ శక్తి పథకం (ఆంధ్రప్రదేశ్) కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించగా, న్యూయార్క్‌లో మామ్దానీ ఈ పథకాన్ని నగరవాసులందరికీ వాగ్దానం చేశారు. రోజువారీ ప్రయాణ ఖర్చులు భారంగా ఉన్న న్యూయార్క్‌లోని మధ్యతరగతి ప్రజలు, కార్మిక వర్గం మరియు వలసదారులను ఈ ‘ఫాస్ట్ అండ్ ఫ్రీ బస్సులు’ హామీ బాగా ఆకర్షించింది. ఇది తమకు ఆర్థికంగా వెసులుబాటు కలిగించే చర్యగా న్యూయార్క్ వాసులు భావించారు. ఈ వాగ్దానం మామ్దానీ గెలుపులో కీలక పాత్ర పోషించిందని విశ్లేషిస్తున్నారు.

పైలట్ ప్రోగ్రామ్ విజయం, భారతీయ మూలాలు

మామ్దానీ, న్యూయార్క్ సిటీ సెనేటర్ మైఖేల్ గియానారిస్‌తో కలిసి 2023-24లో ‘ఫేర్-ఫ్రీ బస్’ పథకాన్ని పైలట్ ప్రోగ్రామ్‌గా ఐదు బరోలలో అమలు చేశారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ అమలు తర్వాత రైడర్ షిప్ 30 శాతం పెరిగినట్లు ఫలితాలు తేల్చాయి. ఇది ఈ పథకాన్ని నగరం అంతటా అమలు చేయాలనే మామ్దానీ నిర్ణయానికి ప్రేరణనిచ్చింది. ఉచిత బస్సు పథకానికి అయ్యే వార్షిక ఖర్చు ($800 మిలియన్ డాలర్లు)ను సంపన్నులు మరియు పెద్ద కార్పొరేషన్లపై పన్నులు పెంచడం ద్వారా భర్తీ చేస్తానని మామ్దానీ వాగ్దానం చేశారు. మామ్దానీకి భారతీయ మూలాలు ఉండటం విశేషం.

 

Editor