విశాఖపట్నం: భారీ వర్షాలకు ఇళ్లలోకి కొండచిలువ.. స్థానికుల్లో భయాందోళన

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు ఇళ్లలోకి రావడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతంలో ఓ భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఆరిలోవ పరిధిలోని క్రాంతినగర్‌లో సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ ఒక ఇంటి ముందున్న మురుగు కాలువలో కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ కొండచిలువ నివాస ప్రాంతంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇంటి ముందున్న కాలువలో ఇంత భారీ కొండచిలువను చూసిన స్థానికులు భయపడినా, వెంటనే కొందరు యువకులు ధైర్యం చేశారు. వారు ఆ కొండచిలువకు ఎలాంటి హానీ తలపెట్టకుండా, దానిని సురక్షితంగా పట్టుకున్నారు. యువకులు పట్టుకున్న కొండచిలువను బంధించి, సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వర్షాకాలంలో పాములు మరియు ఇతర విష కీటకాలు తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చి ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తుఫాను ‘మొంథా’ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు తమ పరిసరాలను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

Posted Under AP
Editor