తిరుమల పరకామణి చోరీ కేసు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు మరియు అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారిగా డీజీ స్థాయికి తగ్గని ఆఫీసర్‌ను నియమించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు, పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ మరియు అతడి కుటుంబ సభ్యులకు చెందిన స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీని (Anti-Corruption Bureau) కూడా హైకోర్టు ఆదేశించింది. నిందితులు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరే వారి పేరుపై బదలాయించారా లేదా అనే విషయాన్ని కూడా తేల్చాలని కోర్టు పేర్కొంది. దర్యాప్తు నివేదికను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ మరియు సీఐడీని ఆదేశించింది.
గత ప్రభుత్వ హయాంలో 2023లో తిరుమల పరకామణిలో జరిగిన ఈ చోరీ కేసుపై.. టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే అప్పటి ఏవీఎస్‌వో అయిన వై. సతీష్ కుమార్ లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకోవడాన్ని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుబట్టారు. అంతకుముందు, పరకామణి రికార్డ్స్ ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించిన హైకోర్టు, ఈ వ్యవహారంపై పెద్దఎత్తున దుమారం చెలరేగడంతో ఈ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.
