Latest Posts

భారత్‌ను అనుసరిస్తున్న తాలిబన్లు: కునార్ నది నీళ్లు నిలిపేయాలని నిర్ణయం

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందాన్ని రద్దు చేసిన తరహాలోనే, ఇప్పుడు అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. తమ దేశంలోని కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించి పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేయాలని తాలిబన్లు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులు దేశీయ సంస్థల ద్వారానే సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని సుప్రీం నేత మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా ఉత్తర్వులు జారీ చేసినట్లు తాలిబాన్ నీటిపారుదల శాఖ మంత్రి ముల్లాహ్ అబ్దుల్ లతీఫ్ మన్సూర్ వెల్లడించారు.

తాలిబన్ల ఈ నిర్ణయం పాకిస్థాన్-అఫ్గనిస్థాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్‌ (TTP) ఉగ్రవాద సంస్థకు తాలిబన్ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు, ఇరు దేశాల సరిహద్దుల్లో కొనసాగుతున్న హింస నేపథ్యంలో, అఫ్గన్‌కు తన స్వంత నీటిని వినియోగించుకునే హక్కు ఉందని పేర్కొంటూ తాలిబన్లు ఈ దౌత్యపరమైన చర్యకు పూనుకున్నారు.

కునార్ నది, పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని హిందూ కుష్ పర్వతాలలో జన్మించి, అఫ్గన్‌లోకి ప్రవేశించి, తిరిగి పాక్‌లోకి ప్రవహిస్తూ సింధు నదిలో కలుస్తుంది. వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్‌కు కీలకమైన ఈ నదిపై అఫ్గనిస్థాన్ ఆనకట్టలు నిర్మిస్తే, ఇప్పటికే భారత్ సింధూ జలాలను నిలిపివేయడంతో నీటి కొరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు మరింత కష్టాలు తప్పవు. ముఖ్యంగా, అఫ్గన్‌పై ఒత్తిడి తెచ్చి వెనక్కి తగ్గించడానికి సింధూ నదీ ఒప్పందం లాంటి చట్టపరమైన మార్గం పాక్‌కు లేకపోవడం ఘర్షణలు తీవ్రమయ్యే ప్రమాదాన్ని పెంచుతోంది.

Editor