ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఓ కీలక పరిశ్రమ కోసం ఆయన ఆధ్వర్యంలోని ఓ సంస్థ కొనుగోలు చేసిన భూముల రెజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ పరిశ్రమ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని రైతులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి వాటిని పరిశీలించారు. తాజాగా ప్రభుత్వం వీటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది.
ప్రస్తుతం పల్నాడు జిల్లా, అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ పరిశ్రమ ఏర్పాటు కోసం వైఎస్ కుటుంబం భూముల్ని కొనుగోలు చేసింది. వీటిలో పలు ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాము అధికారంలోకి వస్తే సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ కు ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకుంటామని అప్పట్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా సరస్వతీ పవర్ పరిశ్రమ వద్దకు వెళ్లి ఆ భూములపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు సరస్వతీ పవర్ భూములపై విచారణ జరిపారు. ఇందులో పల్నాడు జిల్లా మాచవరం మండలంలో 20 ఎకరాలు, పిన్నెల్లి మండలంలో మరో 4.84 ఎకరాలు అసైన్డ్ భూములు ఈ పరిశ్రమ కోసం కొన్నారని నిర్దారించారు. అలాగే ప్రభుత్వ భూముల్ని తప్పుగా రిజిస్ట్రేషన్లు చేశారని స్థానిక ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 24.84 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు స్థానిక తహసీల్దార్ పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి లాంఛనాలు పూర్తి చేశారు. దీంతో గతంలో సరస్వతీ పవర్ కోసం వైఎస్ కుటుంబం సేకరించిన భూముల్లో 24.84 ఎకరాలు తిరిగి ప్రభుత్వ పరం కాబోతోంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంతం కూడా నెరవేరినట్లయింది
