ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ప్రభుత్వం టెట్, డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల్లోనే పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు.
టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేసారు. ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాలని కోరడంతో వారి విజ్ఞప్తి మేరకు నారా లోకేష్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్ లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి 2025 నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
