వాలంటీర్లకు ఏపీ సర్కార్ భారీ షాక్.. !

ఏపీలో వాలంటీర్లకు ఇవాళ భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో దాదాపు 2.67 లక్షల మంది వాలంటీర్లను గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో 5 వేల జీతానికి నియమించింది. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మించి పోయి పథకాల లబ్దిదారుల ఎంపికతో పాటు అన్ని విషయాల్లోనూ తమ ప్రతాపం చూపించారు. దీనిపై గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలన్నీ విమర్శలు చేసేవి. కానీ ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇచ్చాయి. వాలంటీర్లకు జీతం 10 వేలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చాయి. కానీ ఇవాళ తొలి కేబినెట్ భేటీలో మాత్రం షాకిచ్చాయి.

 

ఇవాళ జరిగిన కూటమి ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు బదులుగా సచివాలయాల సిబ్బంది సేవల్ని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతీ నెలా పెన్షన్లు ఇప్పించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా వాలంటీర్లకు పింఛన్ల పంపిణీ నుంచి విముక్తి కల్పించినట్లయింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పెన్షన్లను పంపిణీ చేసిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం ఆ పని నుంచి తప్పించింది.

 

ఇదే అంశంపై సమాచార మంత్రి పార్ధసారధిని కేబినెట్ భేటీ తర్వాత అడిగితే వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి జూలై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యత మాత్రం సచివాలయ సిబ్బందికి ఇచ్చిన్నట్లు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే దానిపై మాత్రం ఇవాళ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో భవిష్యత్తులో వీరి కొనసాగింపు, జీతాల పెంపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

 

ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో లక్ష మంది వాలంటీర్ల వరకూ రాజీనామాలు చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు వీలుగా ఆ పార్టీ నేతలు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీరిలో కొందరు స్వచ్చందంగానే బాధ్యతలు వదులుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు అలాంటి వారంతా తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో టీడీపీ మంత్రులు ఈ మధ్య మీతో రాజీనామాలు చేయించిన వారిపై కేసులు పెట్టి రావాలని సూచించారు. దీంతో వీరు మంత్రులు చెప్పినట్లుగా వైసీపీ నేతలపై పోలీసు స్టేషన్లలో భారీగా ఫిర్యాదులు కూడా చేశారు.

Posted Under AP
Editor