ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ (AP Assembly Speaker) గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ తరుపున నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-96లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1996లో టీడీపీ తరుపున అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 1999లో టీడీపీ ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు.నర్సీపట్నంలో తిరుగులేని నాయకునిగా ఎదిగిన అయ్యన్న..2019లో ఓటమి పాలయ్యారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపు జెండా ఎగురవేసి.. అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
కాగా.. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను ప్రకటించనున్నారు. కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. లోక్ సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై, రాష్ట్రానికి నిధులు తీసుకురావడంపై చర్చించి.. ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
