ఏపీలో ఇటీవలే ఎన్నికలు జరుగగా.. ఆ ఎన్నికల తర్వాత చెలరేగిన హింస ఇంకా కళ్లెదుటే ఉంది. పోలీస్ అధికారులు సస్పెండ్, సిట్ నివేదిక, పలువురి అరెస్ట్.. ఇంకా కేసు ముగియకుండానే.. మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజున ఈవీఎంను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన మహిళపై దుర్భాషలాడిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం సాయంత్రం నుంచి ఈ వీడియో ఏపీతో పాటు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీ సీఈఓకు నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల రోజు ఇంత జరిగినా కేసు నమోదు చేయకపోవడంపై సీరియస్ అయింది. వీడియోలో ఉన్నది ఎమ్మెల్యేనేనా? ఎమ్మెల్యేనే అయితే ఇంకా కేసు ఎందుకు పెట్టలేదు ? ఎందుకు అరెస్ట్ చేయలేదు ? చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించింది. ఎమ్మెల్యేనే ఘటనలో ఉంటే.. అతన్ని అరెస్ట్ చేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
సీఈసీ ఆదేశాలతో.. ఏపీ డీజీపీకి సీఈఓ విషయం తెలిపారు. సీఈసీ ఆదేశాలతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. పిన్నెల్లి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కు పంపించారు. కానీ.. కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసి.. పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు. మొబైల్ స్విచ్ఛాఫ్ లో ఉండటంతో పిన్నెల్లి ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు.
ఇదిలా ఉండగా.. పోలింగ్ తర్వాత పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ కు వెళ్లిపోయారు. మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం, పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని తెలిసి పిన్నెల్లి బ్రదర్స్ హైదరాబాద్ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశారు. సంగారెడ్డి వద్ద పోలీసులకు పిన్నెల్లి కారు దొరకగా.. పోలీసులకు దొరక్కుండా పారిపోయినట్లు సమాచారం. పిన్నెల్లి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు టీడీపీ నేతలు పిన్నెల్లి బయట ఉంటే విధ్వంసాలు, హింసాకాండలే జరుగుతాయని ఆరోపిస్తున్నారు. ఆయన్ను సాయంత్రం 5 గంటల్లోగా అరెస్ట్ చేయలేకపోతే వ్యవస్థలు విఫలమైనట్లేనన్నారు.
