కవితకు మరోసారి చుక్కెదురు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం మరో వారం రోజులు పొడిగించింది. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ నేటి(మే 07)తో ముగియటంతో.. కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు.

 

అయితే, మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం.. కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకు పొడిగించింది. దీంతో అప్పటివరకు ఆమె తీహార్ జైలులోనే ఉండనున్నారు.కాగా, జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న తనను కోర్టు విచారణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా ప్రవేశపెట్టేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరుతూ కవిత చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి కావేరి బవేజా పరిగణనలోకి తీసుకున్నారు.

 

ఇక మీదట కోర్టు విచారణ సమయంలో అవసరమైనప్పుడు కవితను నేరుగా హాజరుపరచాలని దర్యాప్తు సంస్థల అధికారులను ఆదేశించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడిషియల్‌ రిమాండ్‌ నేటితో ముగుస్తుండడంతో ఆమెను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

 

ఈ కేసులో కవిత కీలక పాత్రధారి కాబట్టి బెయిల్‌ ఇవ్వొద్దని, దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె బయటికొస్తే.. సాక్షులు, సాక్ష్యాలను ప్రభావితం చేసే వీలుందని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు, మహిళగా, బీఆర్‌ఎస్ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న ఆమెకు బెయిల్‌ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోరారు. ఆమె ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని అప్పీల్‌ చేశారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మరో వారం రోజులు కస్టడీని పొడిగించింది.

 

కోర్టు ముందు హాజరైన తర్వాత బయటికి వస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి.. తనలాంటి వారిని అరెస్ట్ చేశారంటూ కేంద్రంలోని బీజేపీపై మండిపడ్డారు. దేశ ప్రజలంతా ఈ విషయాలను గమనించాలన్నారు కవిత.

 

కాగా, దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద కవితను ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్‌ 11న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు కవిత రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్నది దర్యాప్తు సంస్థల ప్రధాన ఆరోపణగా ఉంది.

Editor