Latest Posts

దశలవారీ శిక్షణ ఇచ్చాం… పటిష్ట చర్యలు చేపట్టాం.. రాష్ట్ర పోలీస్ పరిశీలకులకు పవర్ పాయింట్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున..

విశాఖపట్నం, ఏప్రిల్ 28:- జిల్లాలో ఎన్నికల నిర్వహణలో.. ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టామని, అధికారులకు, సిబ్బందికి దశల వారీగా అనుభవజ్ఞులతో శిక్షణ అందజేశామని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా ఆదివారం జిల్లాలో పర్యటించి స్థానిక పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున చేపట్టిన చర్యలను వివరించారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ దశల్లో భాగస్వామ్యం కానున్న అధికారులకు, సిబ్బందికి అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించామని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మాస్టర్ లెవెల్ ట్రైనర్స్ ను అందుబాటులో ఉంచామని తెలిపారు. 15 వేల మంది ఉద్యోగులను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. ఏడు విభాగాల కంట్రోల్ రూమ్ లను జిల్లా కలక్టరేట్ లో ఏర్పాటు చేశామని వాటి ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి విభాగానికి నోడల్ అధికారిని నియమించామని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్స్, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల గురించి రాష్ట్ర పోలీస్ పరిశీలకులకు వివరించారు. 502 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అక్కడ పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. మైక్రో అబ్జర్వర్స్, వీడియో గ్రాఫర్స్ ను అందుబాటులో ఉంచామన్నారు. అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు ఏడు రకాల 110 బృందాలను నియమించామని తెలిపారు. ఏడు పోలీస్ చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. వస్తు, ధన రూపేణా ఇప్పటి వరకు రూ.13.27 కోట్ల నగదును జప్తు చేశామని వివరించారు. సి. విజిల్ యాప్ ద్వారా 530 వినతులు స్వీకరించగా అందులో 395కి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపామని పేర్కొన్నారు. వివిధ మార్గాల ద్వారా రాష్ర్ట ఎన్నికల కమిషన్ నుంచి రెఫర్ చేసిన 56 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. వాలంటీర్లు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల ప్రతినిధులపై వివిధ ఘటనల్లో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, కమిటీల ఏర్పాటు, నోడల్ అధికారుల నియామకం, అనుమతులు జారీ ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

Posted Under AP
Editor