కజిరంగ నేషనల్ పార్క్ ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ అభయారణ్యం ఖడ్గం మృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగులు, జంకలు, పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు విస్తారంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రంలో అద్భుతమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా ఈ పార్కు నిలుస్తోంది.. ఈ అభయారణ్యం అస్సాం రాష్ట్రంలోని గోలఘాట్, నాగోవాన్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యాన్ని 1904 లో ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి దీనిని నేషనల్ పార్క్ గా ప్రకటించారు. మనదేశంలో ఉన్న అతిపెద్ద అభయారణ్యాలలోకజిరంగ నేషనల్ పార్క్ కూడా ఒకటి. దేశంలో ఎక్కడా కనిపించని ఖడ్గ మృగాలు ఇక్కడ మాత్రమే దర్శనమిస్తుంటాయి. ఇందుకు ఈ అడవిలో ఉన్న వాతావరణమే కారణం. పులులు, ఏనుగులు, నక్కలు, కోతులు, అడవి దున్నలు, జింకలు, దుప్పులు వంటి జంతువులు ఇక్కడ విస్తారంగా తిరుగుతుంటాయి. వీటిని సందర్శించేందుకు అభయారణ్య సిబ్బంది పర్యాటకుల కోసం ఓపెన్ జీప్ సౌకర్యాన్ని కల్పిస్తుంటారు..
నాలుగు జోన్లుగా..
ఈ అభయారణ్యాన్ని కజిరంగ నేషనల్ పార్క్ సిబ్బంది నాలుగు జోన్లుగా విభజించారు. ఈ నాలుగు జోన్లలో టైగర్ రిజర్వ్ అత్యంత దట్టమైన అడవిలో ఉంటుంది.. 2006లో ఈ అడవిని టైగర్ రిజర్వుగా ప్రకటించారు. ఈ అడవిలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పులుల సాంద్రత ఉన్నది. 430 చదర కిలోమీటర్ల విస్తీర్ణంలో కజిరంగ నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. 1985లో ఐక్యరాజ్యసమితి ఈ అడవిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.. కేవలం జంతువులు మాత్రమే కాకుండా అరుదైన పక్షులు కూడా ఈ కజిరంగ నేషనల్ పార్క్ లో కనిపిస్తాయి.
బ్రహ్మపుత్ర నది ప్రవాహంతో..
బ్రహ్మపుత్ర నది 365 రోజులు ఈ అడవి మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ అడవిలో వృక్ష సంపద విస్తారంగా ఉంటుంది. ఉష్ణ మండల తేమతో కూడిన మిశ్రమ ఆకురాల్చే అడవులు, ఉష్ణ మండల పాక్షిక సతత హరిత అడువులు, పొడవైన గడ్డి ఉన్న మైదానాలు, పొట్టి గడ్డి ఉన్న మైదానాల వల్ల ఈ అడవిలో విస్తారంగా జింకలు పెరుగుతుంటాయి. పర్యాటకుల కోసం ఓపెన్ జీప్ సవారి ఉంటుంది. ఎంచుకున్న ప్యాకేజీల ఆధారంగా ఏనుగు సవారి కూడా ఉంటుంది. ఇంతటి అత్యద్భుతమైన జంతుజాలం, విభిన్నమైన జీవవైవిధ్యం ఉంది కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కజిరంగ నేషనల్ పార్క్ ను చూసి మైమరిచిపోయారు.. అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసి పర్యాటకుల్లో అమితాసక్తిని కలిగించారు. ఇక ఈ అభయారణ్యం నవంబర్ నుంచి ఏప్రిల్ ఒకటి వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. దీనిని మే ఒకటి నుంచి అక్టోబర్ 31 వరకు మూసివేస్తారు. ఆ సమయంలో జంతువులు ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
