Latest Posts

రైతులు, లంబాడీలపై రేవంత్ అవమానకర వ్యాఖ్యలు: కేసీఆర్‌తో పోలికా అంటూ హరీశ్ రావు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులను అవమానిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ నేత రాములు యాదవ్‌, ఓదెల జడ్పీటీసీ తాటి కృష్ణ, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు రేగుల తిరుపతి, ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గ్యారనేని నాగరాజు యాదవ్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రవియాదవ్‌లకు మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి రైతు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా..? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు రైతులకు రైతుబంధు ఇచ్చి బిచ్చగాళ్లలా మార్చిందన్న రేవంత్ వ్యాఖ్యలను హరీశ్ రావు తప్పుపట్టారు. వ్యవసాయంపై రేవంత్‌రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ ముఠా చేతుల్లోకి వెళ్లిందన్నారు.

తన స్వార్థం కోసం రేవంత్‌రెడ్డి పార్టీలు మారుతున్నాడని విమర్శించారు హరీశ్. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా రేవంత్‌రెడ్డి పదవిని పట్టుకుని వేలాడాడని హరీశ్‌రావు ఆరోపించారు. పైగా తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టాడని గుర్తుచేశారు. అంతేగాక, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఘోరంగా అవమానించి, అవహేళన చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

లంబాడీలకు క్వార్టర్‌ మందు ఇస్తే ఓటు వేస్తారని రేవంత్ అవమానకరంగా మాట్లాడారని విమర్శించారు హరీశ్ రావు. సీఎం కేసీఆర్‌ పట్ల రేవంత్‌ రెడ్డి దుర్మార్గమైన భాషను వినియోగిస్తున్నాడని, తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్‌ అని హరీశ్‌రావు అన్నారు.

సీఎం కేసీఆర్‌ పాలనలో పెద్దపల్లి జిల్లాలోని చిట్ట చివరి భూముల వరకు సాగునీరు అందుతున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి పొంతన ఏమైనా ఉందా..? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో భూముల విలువ పెరిగిందన్నారు. సుపరిపాలనతో రైతును రాజును చేసిన వ్యక్తి కేసీఆర్‌ అని కొనియాడారు. కాంగ్రెస్ నేతల మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

YES9 TV