మధ్యప్రదేశ్ అసెంబ్లీకి వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉన్నప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందన్న అనుమానాలే.
దీంతో ప్రధాన సర్వే సంస్ధలు కూడా ఏకపక్షంగా ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పలేకపోతున్నాయి. అయితే కొన్ని అంశాల్లో మాత్రం స్పష్టత కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజిస్తే ఇందులో వేటికవే భిన్నమైన పరిస్ధితులు, కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. అయితే ప్రాంతాలకు అతీతంగా కనిపిస్తున్న ఏకైక కారణం మధ్యలో ఏడాదిన్నర మినహాయిస్తే దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతే. చాలా చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ పై నెలకొన్న వ్యతిరేకత వారి పుట్టి మంచేలా ఉంది.
అయితే ఇంతటి వ్యతిరేకత మధ్య కూడా బీజేపీకి కలిసొస్తున్న ఏకైక అంశం కాంగ్రెస్ పార్టీపై వారి కున్న నమ్మకమే. హిందీ రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లో ప్రధాని మోడీ ఛరిష్మా ఎలాగైనా పనిచేస్తుందని, దాంతో పోలిస్తే ప్రభుత్వంపై, బీజేపీ ఎమ్మెల్యేలు, సీఎంపై వ్యతిరేకత అంతగా ప్రభావం చూపదని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే ఈసారి ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా కీలకంగా మారాయి.
అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా వ్యతిరేకతను నమ్ముకోవడంతో పాటు గత ఎన్నికల్లో తమకు ప్రజలు పట్టం కట్టినా బీజేపీ తమ నుంచి అధికారాన్ని లాక్కుందన్న ఆగ్రహం ప్రజల్లో ఉందని నమ్ముతోంది. ముఖ్యంగా గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో సింధియా వర్గానికి గతంతో పోలిస్తే పట్టు తగ్గిందని భావిస్తోంది. అలాగే తమ సంక్షేమ అజెండా ఈసారి గట్టిగానే పనిచేస్తుందని, ఎన్నికలు జరుగుతున్న మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఉన్న అనుకూల పరిస్ధితులు మధ్యప్రదేశ్ పైనా ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ సంస్ధాగతంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలే ఇక్కడ ఆ పార్టీకి మైనస్ అవుతున్నాయి.
