తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. స్ధానికంగా అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు.
ఈసారి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులకు పలు సూచనలు అందించారు. అలాగే రాజకీయ పార్టీల నుంచి విజ్ఞాపనలు కూడా తీసుకున్నారు. అనంతరం ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించి వాటి వివరాలను అందించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 3.17 కోట్ల ఓటర్లు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలతో ముందుగా తొలిరోజు సమావేశం అయ్యామని, రెండో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో భేటీ అయినట్లు తెలిపారు. అభ్యర్ధుల ఎన్నికల ప్రచార వ్యయం పెంచమని రాజకీయ పార్టీల నుంచి విజ్ఞాపనలు అందినట్లు సీఈసీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏకపక్షంగా ఎక్కడా ఓటర్ల తొలగింపు జరగలేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాను ఎంతో పారదర్శకంగా రూపొందించామని, ఫామ్ 7 అందిన తర్వాతే, ధృవీకరించి ఓట్ల తొలగింపు చేపట్టామన్నారు. 2022-23లో రాష్ట్రంలో మొత్తం 22 లక్షల ఓట్లు తొలగించినట్లు సీఈసీ వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్లు 8.11 లక్షల మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో మొత్తం 35356 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు సీఈసీ తెలిపారు. ఇందులో అర్బన్ లో 14458 స్టేషన్లు, రూరల్ లో 20898 స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. సగటున ప్రతీ పోలింగ్ స్టేషన్లో 897 మంది ఓటర్లు ఉన్నారన్నారు. రాష్ట్రంలో 27798 పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ సదుపాయం అందుబాటులో ఉంచామన్నారు. 2018తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల్లో ఓటర్లకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికల అక్రమాల అడ్డుకట్టకు కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
