న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు రగిలింది. విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఈ విషయంలో భారత్ ఓ అడుగు ముందే ఉంది.

ఏకంగా భారత్‌లోని ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లను జారీ చేసింది. దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత్‌లోని కెనడా సీనియర్ రాయబారిని ఆదేశించింది. అయిదు రోజుల గడువు విధించింది.

దీనికి కారణం లేకపోలేదు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రకటించారు. ఈ మేరకు తమ దేశ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పక్కా సమాచారం అందిందని అన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపిస్తోన్నామని చెప్పారు.

ఈ ప్రకటన ఈ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగడానికి కారణమైంది. ఆయన చేసిన ప్రకటనను తోసిపుచ్చింది. అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ట్రూడో చేసిన ప్రకటనతో తాము విభేదిస్తోన్నామని స్పష్టం చేసింది. ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటో తమకు తెలియదని, ఏదేమైనప్పటికీ- ట్రూడో చేసిన ప్రకటన అవాస్తవమని పేర్కొంది.

జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలో ఈ హత్య చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గల గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు.

ఈ హత్యోదంతంపై తాజాగా జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందని పేర్కొన్నారు. ఇది కాస్తా భారత్- కెనడా మధ్య చిచ్చు పెట్టినట్టయింది. ట్రూడో ప్రకటనపై భారత్ శరవేగంగా స్పందించింది. తన నిరసన తెలియజేసింది. భారత్‌లోని కెనడా రాయబారిని దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. హైకమిషనర్ కామెరాన్ మెక్‌కేకూ సమన్లను జారీ చేసింది.

Editor