ఈ సంవత్సరం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 20 వ తేదీ నుంచి ఆగస్ట్ 11 వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి.
ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ప్రకటించారు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్న పరిస్థితుల్లో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశముంది.
కొత్త భవనంలోనేనా?
ఈ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు కొత్త భవనంలో జరుగుతాయా? లేక పాత భవనంలోనే కొనసాగుతాయా? అన్న విషయంపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. మే 28న ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త భవనంలోనే సమావేశాలు ప్రారంభమవుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు మొదట పాత భవనంలో ప్రారంభమై, ఆ తరువాత కొత్త భవనంలోకి మారుతాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఉమ్మడి పౌర స్మృతిపై చట్టం?
బీజేపీ ఎజెండా లో చాలా సంవత్సరాలుగా ఉన్న ఉమ్మడి పౌర స్మృతి పై చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల సూచన ప్రాయంగా చెప్పారు. ఈ దిశగా ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ బిల్లును ఎన్డీయే పక్షాలతో పాటు కొన్ని పార్టీలు సమర్ధిస్తుండగా, ప్రధాన విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశముంది. అలాగే, ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై జారీ చేసిన ఆర్డినెన్స్ పై కూడా బిల్లును సభలో ప్రవేశపెడ్తారు. దీన్ని ఆప్ సభ్యులు తీవ్రంగా అడ్డుకోనున్నారు.