ఢిల్లీలో కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండే 22 ఏళ్ల ఆశిష్ కు వికాస్, వంశు అనే ఇద్దరితో చాన్నాళ్లుగా శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో గతవారం ఒక రోజు వికాస్, వంశు కలిసి ఆశిష్ ఇంటికి వచ్చారు.
ఇక శత్రుత్వాన్ని వదిలేద్దామని, స్నేహితులుగా కలిసి ఉందామని చెప్పారు. ఫ్రెండ్స్ గా మారినందువల్ల బార్ లో మందు పార్టీ ఇస్తామని చెప్పి ఆశిష్ ను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లారు.
తండ్రికి అనుమానం వచ్చి..
వికాస్, వంశులకు నేర చరిత్ర ఉన్న విషయం ఆశిష్ తండ్రికి తెలుసు. అందువల్ల, తన కుమారుడిని వారు నమ్మించి బయటకు తీసుకువెళ్లడంపై ఆయనకు అనుమానం ప్రారంభమైంది. దాంతో, ఆయన వారికి తెలియకుండా, వారిని ఫాలో కావడం ప్రారంభించారు. ఢిల్లీలో దాదాపు అరగంట పాటు ప్రయాణించిన తరువాత, అకస్మాత్తుగా వికాస్ ఆశిష్ తో గొడవపడడం ప్రారంభించాడు. అతడికి వంశు కూడా జతకలిశాడు. ఇద్దరు కలిసి ఆశిష్ ను తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో రోడ్డుపైననే, అందరూ చూస్తుండగానే, విచక్షణారహితంగా పొడవసాగారు. రోడ్డుపై పడిపోయినప్పటికీ వదలకుండా, దారుణంగా కత్తులతో పొడిచేశారు. వారిద్దరూ ఆశిష్ ను కత్తితో పొడుస్తున్న సమయంలో అక్కడి వ్యక్తులు తీసిన వీడియో వైరల్ గా మారింది.
కేసు నమోదు
అప్పటికి అక్కడికి చేరుకున్న ఆశిష్ తండ్రి గట్టిగా అరుస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ లోపు వికాస్, వంశు పారిపోయారు. తండ్రి ఆశిష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, అప్పటికే ఆశిష్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి, ఆ తరువాత ఆసుపత్రికి వచ్చారు. ఆశిష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం, స్నేహితుడి ఇంట్లో దాక్కున్న వికాస్, వంశులను అరెస్ట్ చేశారు. ఆశిష్ ను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్నామని, అందుకే, అతడిని బయటకు తీసుకురావడం కోసం ఫ్రెండ్ షిప్ నాటకం ఆడామని వారు పోలీసులకు తెలిపారు.
