Latest Posts

దమ్ముంటే ఆ పని చెయ్.. రేవంత్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డి సవాల్!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణలో ప్రధానంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్న బిఆర్ఎస్, చేరికలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ లోని కీలక నాయకులపైన మాటల తూటాలను పేలుస్తున్నారు.

తాజాగా టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రేవంత్ పై విమర్శనాస్త్రాలు సంధించిన ఆయన ఎమ్మెల్యేగానే గెలవని రేవంత్ రెడ్డి, సీఎం ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు. కొడంగల్ కు ఎమ్మెల్యేగా తొమ్మిదేళ్ల పాటు పనిచేసిన రేవంత్ అభివృద్ధికి చేసినది శూన్యమని పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుమని పది సీట్లు కూడా రావని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కర్ణాటక రాష్ట్రంలో అమలు పరిచే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని రేవంత్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం రేవంత్ రెడ్డికి అలవాటే అన్నారు.

కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం గురించి ఆలోచించాలని పట్నం నరేందర్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ జిమ్మిక్కులు, గారడి మాటలు నమ్మే రోజులు పోయాయని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

YES9 TV