అనంతపురంలో ఘనంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026 వర్క్‌షాప్

అనంతపురంలో ఘనంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026 వర్క్‌షాప్
ఉత్తమ సేవలకు తాడిమర్రి మండల పంచాయతీ అభివృద్ధి అధికారులకు రాష్ట్ర స్థాయి అవార్డులు
అనంతపురం: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026పై ఒకరోజు రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమం, వర్క్‌షాప్ అనంతపురంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ గౌరవ సుధాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో విశేష కృషి చేసిన అధికారులను రాష్ట్రస్థాయిలో “ఉత్తమ పంచాయతీ కార్యదర్శి/గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి” అవార్డులతో సత్కరించారు.
ధర్మవరం డివిజన్ పరిధిలోని తాడిమర్రి గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి ఎస్. రిజ్వానా బేగం అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. అలాగే పిన్నదరి గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి జి. పరమేశ్వర్, కునుకుంట్ల గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి వెంకటరెడ్డి కూడా తమ ఉత్తమ సేవలకు గుర్తింపుగా రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్నారు.
ఈ అవార్డులు అందుకోవడం తాడిమర్రి మండలానికి గర్వకారణంగా నిలిచింది. గ్రామాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో వినూత్న చర్యలు చేపట్టడం, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాల్లో వీరు చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది.
అవార్డు గ్రహీతలను సహచర అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, సిబ్బంది, ప్రజలు అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్పూర్తితో గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్రస్థాయి పురస్కారం తాడిమర్రి మండలంలోని ఇతర గ్రామపంచాయతీ అధికారులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

Posted Under AP
Editor