Latest Posts

టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్: అడ్వాన్స్ రిజర్వేషన్ ఛార్జీల తగ్గింపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ప్రయాణికులకు మరో తీపికబురు అందించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను టీఎస్ఆర్టీసీ సవరించింది.

ముందస్తు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా ఛార్జీని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30 వసూలు చేయనుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన ఉందని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

ప్రతి రోజు సగటున 15 వేల వరకు తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తగ్గించడం జరిగింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలి అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.

మరోవైపు, రక్తదానంపై కూడా అవగాహన కల్పిస్తోంది టీఎస్ఆర్టీసీ. తెలంగాణ వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే ట్యాగ్‌లైన్‌లో ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు.

మానవత్వంతో స్పందించి బ్లడ్ డోనేట్ చేయడానికి ముందుకు రావాలని సంస్థ తరపున కోరుతున్నారు. డిపో పరిధిలోని ప్రతి విద్యాసంస్థ నుంచి 20 నుంచి 30 మంది స్టూడెంట్స్ పాల్గొని రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది టీఎస్ఆర్టీసీ.

YES9 TV