వేసవి సెలవులు ముగిసాయి. రేపటి నుంచి (సోమవారం) తిరిగి బడి గంటలు మోగనున్నాయి. ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. దీంతో పాఠశాలల ప్రారంభం వాయదా వేయాలనే అభ్యర్ధనలు వచ్చాయి.
అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఎండల తీవ్రత కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ప్రారంభం నిర్ణయంలో మార్పు లేకపోయినా..ఈ నెల 17వ తేదీ వరకు మాత్రం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేసింది.
17వరకు ఒంటిపూట బడులు : పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఏపీలో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో పాఠశాలల ప్రారంభం వాయిదా వేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి లేఖలు రాసాయి. దీనిని పరిశీలించిన ప్రభుత్వం పాఠశాలలు యధావిధిగా ప్రారంభిచాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ నెల 12న ప్రారంభం కానున్న పాఠశాలలను ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని నిర్ణయించింది. 17వ తేదీ నాటికి ఎండల తీవ్రతను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది. దీంతో, ఉదయం 9 గంటల లోగానే పాఠశాలల్లో రాగి జావ పంపిణీ చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
