అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాళ్టితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి.
2019లో ఇదే రోజున వైఎస్ జగన్.. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల కాలాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకొంటోన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తోన్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవనాన్ని వైఎస్ జగన్ దంపతులు ప్రారంభించారు.
అక్కడి మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్మల్ హృదయ్ భవన్‌లోని అనాథ పిల్లలు, వృద్ధులతో ముఖ్యమంత్రి దంపతులు ముచ్చటించారు. వారితో ఫొటోలు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయాల వద్ద జెండాలను ఎగురవేశారు.
తాడేపల్లిలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నాలుగేళ్ల సంబరాలను నిర్వహించారు. మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనను ఓ చరిత్రగా అభివర్ణించారు. ఎన్నికలొస్తోన్నాయనగానే గుంట నక్కలు పగటి వేషాలు వేసుకొని వస్తుంటాయని, ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాయని తెలుగుదేశం పార్టీని విమర్శించారు.
