ఐపీఎల్ -16వ సీజన్ లో సూర్య ప్రతాపం తారాస్థాయికి చేరింది.
10 జట్ల లీగ్ టేబుల్ లో ముంబై 8వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరింది.
ఐపీఎల్ -16వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ సమరం అంచనాలకు అందనిరీతిలో సాగుతోంది. 70 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశ ముగియటానికి మరో మూడురౌండ్ల మ్యాచ్ లు మాత్రమే మిగిలిఉండడంతో పోరు పతాకస్థాయికి చేరింది. నాలుగుజట్ల ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు కోసం మొత్తం 10 జట్లూ భీకరంగా తలపడుతున్నాయి.
హోంగ్రౌండ్లో ముంబై టాప్ గేర్….
డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ రెండో అంచెపోరులో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పై కీలక విజయంతో ముంబై అనూహ్యంగా పుంజుకొంది.
బెంగళూరు అంచె పోటీలో ముంబైని రాయల్ చాలెంజర్స్ కంగు తినిపిస్తే..ముంబై అంచె పోరులో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల విజయంతో బదులు తీర్చుకొంది.
10వ రౌండ్ మ్యాచ్ లు ముగిసే సమయానికి లీగ్ టేబుల్ 8వస్థానానికి పడిపోయిన ముంబై ఇండియన్స్ తన 11వ రౌండ్ మ్యాచ్ లో భారీవిజయం సాధించడం ద్వారా..ఏకంగా మూడోస్థానానికి ఎగబాక గలిగింది.
బెంగళూరుకు ముంబై పగ్గాలు…
ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే నెగ్గితీరాల్సిన 11వ రౌండ్ పోరులో మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపమే ప్రదర్శించాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులతో బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. 200 పరుగుల భారీవిజయలక్ష్యం చేధించడంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఈ కీలకపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 199 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థి ఎదుట 200 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.
డాషింగ్ ఓపెనింగ్ జోడీ విరాట్ కొహ్లీ- డూప్లెసిస్ లతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరుకు తొలి ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే దొరికిపోయాడు. వన్ డౌన్ అనుజ్ రావత్(6) సైతం సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. దాంతో, 16 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయిన బెంగళూరును కెప్టెన్ డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆదుకున్నారు. మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో గట్టిపునాది వేశారు. మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 68, 8ఫోర్లు, 4 సిక్స్‌లు), డుప్లెసిస్(41 బంతుల్లో 65, 5ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ శతకాలతో చెలరేగారు.ఈ జోడీ వెంట వెంటనే అవుట్ కావడంతో బెంగళూరు జోరుకు బ్రేక్ పడింది. మహిపాల్ లోమ్‌రోర్ ఒకే ఒక్క పరుగుకు అవుటయ్యాడు.
డెత్ ఓవర్లలో దినేశ్ కార్తిక్(30), ఇంపాక్ట్ ప్లేయర్ కేదార్ జాదవ్(12 నాటౌట్), హసరంగ(12 నాటౌట్) బ్యాటు ఝళిపించడంతో బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది.
