టిడిపి యువనేత నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి 86 రోజులలో 1,100 కిమీ పూర్తిచేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో సోమవారం నారా లోకేష్ 1,100 కిమీ మైలురాయిని అధిగమించారు.
ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుచేస్తానంటూ నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీని శిలాఫలకంలో నిక్షిప్తం చేశారు.
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల గుండా 400 రోజులలో 4,000 కిమీ పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. నారా లోకేష్ ఇంత సుదీర్గ పాదయాత్ర చేయగలడా లేడా. చేస్తే వైసీపీకి భయపడుతున్న ప్రజలు ఆదరిస్తారా లేదా? దారిలో వైసీపీ శ్రేణులు దాడులు చేస్తే నారా లోకేష్‌ని ఎలా కాపాడుకోవాలి?వంటి అనేక అనుమానాలు, భయాల మద్య నారా లోకేష్ కుప్పంలో తొలి అడుగువేశారు.
ఊహించిన్నట్లే మొదట్లో వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్:1 అడ్డుపెట్టుకొని నారా లోకేష్‌ని అడ్డుకొనేందుకు శతవిదాల ప్రయత్నించింది. కానీ నారా లోకేష్ భారత రాజ్యాంగం పుస్తకం చేతపట్టుకొని పోలీసులను “మీరు ఇదే రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్నారా లేక రాజారెడ్డి రాజ్యాంగానికా?” అంటూ ధీటుగా నిలదీస్తుండటంతో నారా లోకేష్‌ని అడ్డుకొని అనవసరంగా ఆయనను ప్రజల దృష్టిలో హీరోగా చేస్తున్నామని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అప్పటి నుంచే నారా లోకేష్ పాదయాత్ర కాస్త వేగం పుంజుకొందని చెప్పవచ్చు.
ఓ పక్క ప్రజల కష్టానష్టాలను అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెపుతూనే మరోపక్క వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను ‘సెల్ఫీ ఛాలెంజ్’తో బయటపెడుతూ నారా లోకేష్ నిలదీసి ప్రశ్నిస్తున్నారు. ఎండనక, వాననక నారా లోకేష్ ఉత్సాహంగా ముందుకు సాగుతుంటే, వేలాదిమంది ఆయన వెంటనడుస్తున్నారు.
నారా లోకేష్ తమ నియోజకవర్గంలో అడుగుపెట్టి తమ ఏ బండారం బయటపెడతాడో అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అలాగని నారా లోకేష్‌ని ఢీ అంటే ఢీ అని ఎదుర్కొందామంటే ఆయన మరిన్ని తవ్వితీసి బయటపెడతాడనే భయంతో వెనకడుగు వేయకతప్పడం లేదు. నారా లోకేష్ పాదయాత్ర వేగం పుంజుకోవడానికి ఇదీ ఓ కారణమే అని భావించవచ్చు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న జనాధారణ కూడా వైసీపీని చాలా కలవరపెడుతోంది. కానీ నారా లోకేష్ పాదయాత్ర గురించి వైసీపీలో ఎవరికీ తెలియన్నట్లు నటిస్తున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన తమ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నాడని ఆందోళన చెందుతుంటే, టిడిపి శ్రేణులు ఆయన రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.
