ఒకే ఒక్క ప్రెస్ నోట్.. ఒకే ఒక్క వీడియో బైట్.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులందర్నీ ఒక్కతాటిపైకి తెస్తోంది.! ‘నాయకుల్ని తిట్టుకోండి..
ప్రజల్ని మాత్రం తిట్టొద్దు..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడమే ఇందుక్కారణం.!
ఇప్పడంటే, తెలంగాణ ప్రజల విషయంలో మాట్లాడారు. గతంలో ఆయన ఇదే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కూడా ప్రస్తావించారు.! అయితే, రాజకీయాల్లో వాస్తవాలు అనవసరం. ఇప్పడంతా కట్ అండ్ పేస్ట్ వ్యవహారాలు నడుస్తున్నాయ్. ‘పొలిటికల్ ఇల్లిటరేట్స్’ తయారయ్యారు. నెటిజన్లలో అయితే, ఆయా రాజకీయ పార్టీలు వేసే బిచ్చానికి అలవాటు పడ్డ కొన్ని పరాన్నజీవులు, ట్రోలింగ్ మీద బతికేస్తున్నాయ్.. అవి చేసే ఛండాలం అంతా ఇంతా కాదు.!
అసలు విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు, తెలంగాణ ప్రజలపై అత్యంత దిగజారుడుతనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేశారట. క్లాస్ తీసుకున్నారట కూడా. ఈ విషయాన్ని స్వయానా మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
ఆ సీదిరి అప్పలరాజు వ్యాఖ్యల్ని జనసేన అధినేత ఖండించారు. ‘మీరు తిట్టాలనుకుంటే రాజకీయంగా రాజకీయ నాయకుల్ని తిట్టుకోండి.. తెలంగాణ ప్రజల్ని అవమానపరచొద్దు..’ అని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు జనసేన అధినేత. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
అంతే, ‘కేసీయార్ ఇచ్చిన వెయ్యి కోట్లకు లొంగిపోయి, తెలంగాణ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నావ్..’ అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం, జనసేన అధినేతను ట్రోల్ చేస్తోంది. అదే సమయంలో, టీడీపీ కూడా జనసేన అధినేతను ట్రోల్ చేస్తుండడం గమనార్హం. చిత్రంగా ఈ విషయంలో బీజేపీ కూడా, జనసేన అధినేతపై మండిపడుతోంది.
గతంలో తెలంగాణ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడూ జనసేనాని ఖండించారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల విషయమై ఏపీ నాయకుల అభ్యంతరకర వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఇందులో తప్పేముంది.?
