మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy) ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
నిన్నటి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా చేర్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ ఎదుట హాజరుకావాలని నిన్న అవినాష్ కు నోటీసులు అందాయి. ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. లంచ్ మోషన్ పిటిషన్ గా మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనున్నారు.
వివేక హత్య తర్వాత వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు ఉదయ్ రెడ్డి ఆధారాలను ధ్వంసం చేశారని సిబిఐ అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో సిబిఐ అవినాష్ ని సహ నిందితుడిగా చేర్చింది. మరోవైపు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.
