ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఆసీస్ యువ సంచలనం కామెరూన్ గ్రీన్ కూడా ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టుకు అతడు ఆడేది లేదని అనుమానంగా మారింది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అతడి వేలుకు గాయం కావడంతో భారత్‌తో జరగనున్న తొలి టెస్టుకు దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. ఈ అంశంపై తాజాగా ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డోనాల్డ్ స్పందించాడు. టీమిండియాతో తొలి టెస్టుకు కామెరూన్ గ్రీన్ వచ్చేందుకు కొద్దిపాటి అవకాశముందని తెలిపాడు. “గత రెండు రోజులుగా కామెరూన్ ఫిట్నెస్‌పై కొన్ని కీలకమైన అడుగులు ముందుకు పడ్డాయి. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. అతడు జట్టులోకి వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయి. తుది జట్టులో ఆడేందుకు కొద్దిపాటి ఛాన్స్‌లు ఉన్నాయి” అని ఆండ్రూ మెక్‌డొనాల్డ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
కామెరూన్ గ్రీన్ తొలి టెస్టు ఆడతాడా
వేలుకు గాయం కారణంగా కామెరూన్ బౌలింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడే విషయంపై కూడా కామెరూన్ గ్రీన్ స్పందించారు. ప్రస్తుతానికైతే అతడికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. “అతడు బౌలింగ్ చేసేటప్పుడు అసౌకర్యంగా ఉన్నాడని నేను చెప్పను. కానీ బ్యాట్ కింగా డెలివరీలు వేసేటప్పుడు గాయపడిన వారికి ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వేలు గాయం గురించి కొంచెం అవగాహన ఉండాలి.” అని ఆండ్రూ తెలిపారు. కామెరూన్ గ్రీన్ భారత్‌కు బయల్దేరే ముందు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేసేటప్పుడు అన్ని రకాల క్లియరెన్స్‌ను పొందాడు. అయితే నాగ్‌పూర్‌లో జరిగే టెస్టుకోసం అతడు ఆడతాడా? లేదనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది. నఆస్ట్రేలియా జట్టులో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న కామెరూన్ గ్రీన్ ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌కు కూడా ఎంపికయ్యాడు. ముంబయి ఇండియన్స్ జట్టు అతడిని భారీ సొమ్ము వెచ్చించి సొంతం చేసుకుంది. 17.5 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.
