పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు బలి: పండుగ వేళ తీవ్ర విషాదం.. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి!

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపుల బీభత్సంలో పిడుగుపాటుకు గురై నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పండుగపూట నాలుగు కుటుంబాల్లో ఈ తీరని విషాదం నెలకొనడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ఆయన, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని, తగిన సహాయం అందించి ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

ఈ ప్రకృతి విపత్తులో ఉరుముల శబ్ద భయానికి ఇద్దరు వృద్ధురాళ్లు ప్రాణాలు కోల్పోగా, పొలాల్లో పనుల్లో ఉన్న ఇద్దరు రైతులు నేరుగా పిడుగుపాటుకు గురై మృతిచెందారు. నరసరావుపేట మండలంలోని పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన తలపనేని నాగమ్మ (63) ఇంటి సమీపంలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడగా, ఆ భీకర శబ్దానికి గుండెపోటుతో అక్కడికక్కడే కన్నుమూశారు. అదేవిధంగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన మేకల వెంకాయమ్మ (60) కూడా తన ఇంటి సమీపంలో పడిన పిడుగు శబ్ద తీవ్రతకు గుండె ఆగి మరణించారు.

మరోవైపు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు అన్నదాతలు పిడుగుపాటుకు బలయ్యారు. పాలపాడు గ్రామానికి చెందిన రైతు డేరంగుల వెంకటయ్య, యాకలవారిపాలెంకు చెందిన రైతు మజ్జిగ చిన్న కోటేశ్వరరావు తమ పొలాల్లో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ పిడుగుల ధాటికి పలు గ్రామాల్లో మూడు ఆటోలు ధ్వంసమవడంతో పాటు కొబ్బరి, మామిడి చెట్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. పండుగ పూట ఒకే నియోజకవర్గ పరిధిలో నలుగురు మృతిచెందడంతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Posted Under AP
Editor