ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘క్వాంటం బయో వ్యాలీ’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. విజయవాడలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. క్వాంటం బయో వ్యాలీ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాయం అందించేందుకు కేంద్రం తరఫున త్వరలోనే నిపుణుల బృందాన్ని అమరావతికి పంపిస్తామని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని, ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయని భరోసా ఇచ్చారు.
ఇదే వేదికపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సంజీవని’ వైద్య ఆరోగ్య కార్యక్రమంపై కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజల్లో ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో సంజీవని పథకం అద్భుతంగా పనిచేస్తోందని కొనియాడారు. ప్రజల జీవనశైలిని మెరుగుపరిచే ఈ సమర్థవంతమైన విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. వంటిల్లే ఫార్మసీగా మార్చుతూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం, వ్యాధులు రాకముందే నివారించే జీవన విధానంపై అవగాహన కల్పించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని జేపీ నడ్డా అభినందించారు. పోలవరం ఎడమ కాలువతో పాటు వెలిగొండ, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందించడం ద్వారా రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయ రంగానికి భారీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చంద్రబాబు పాలనానుభవం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. కేంద్ర సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, భవిష్యత్తులోనూ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
