తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక చర్యలు చేపట్టింది. అలిపిరి మెట్ల మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఏఐ సాంకేతికతతో పనిచేసే రోబో డాగ్‌ను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించింది.
అలిపిరి–తిరుమల నడక మార్గంలో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండటంతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. చీకటి, దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించగల సామర్థ్యం ఈ రోబో డాగ్‌కు ఉందని అధికారులు తెలిపారు.
మెట్లు, రాళ్లు, గుట్టలు వంటి క్లిష్టమైన ప్రాంతాల్లోనూ సులభంగా కదలగల ఈ రోబో డాగ్ ఒక్కోటి సుమారు రూ.20–25 లక్షలు విలువ చేస్తుందని తితిదే అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఒక రోబో డాగ్‌ను 20 రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే వచ్చే నెలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల భద్రత కోసం అటవీ ప్రాంతంలో పూర్తిస్థాయిలో వినియోగించనున్నట్లు తెలిపారు.
