అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలోని జున్జప్ప దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఆలయ నిర్వాహకుల ప్రకారం నాలుగు కేజీలకు పైగా వెండి చోరీకి గురైంది. ఉదయం చోరీని గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే ఆలయంలో గతంలోనూ పలుమార్లు చోరీలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుస ఘటనలతో భక్తులు, గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. దేవాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులపై నిఘా పెంచాలని వారు కోరుతున్నారు.
తాజా చోరీతో పాటు గతంలో జరిగిన ఘటనలపైనా సమగ్ర విచారణ చేపట్టి నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయానికి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి భక్తులు సమర్పించే కానుకలకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
