Latest Posts

హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ పట్టణానికి కొత్త ఆకర్షణగా నిలిచిన శివాజీ విగ్రహం

హిందూపురం, జూలై 17:

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పెనుగొండ రోడ్డుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ సేవా ట్రస్ట్, వానరసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ విగ్రహం పట్టణానికి కొత్త గుర్తింపుగా నిలవనుంది.
హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న హిందూ బంధువుల చిరకాల ఆకాంక్ష నెరవేరడంతో ఆనందం వ్యక్తమైంది. తిరుపతి కమలానంద భారతి స్వామీజీ, కర్నూలు శివసాయి, బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో వేదమంత్రోచ్చారణల నడుమ గణపతి పూజ, సుబ్రహ్మణ్య పూజ, నవగ్రహ హోమాలు నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షకుడిగా, సమాజానికి స్ఫూర్తినిచ్చిన మహా యోధుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చారిత్రక అనుబంధం ఉందని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించి దక్షిణాది ప్రాంతాల్లో యాత్రలు చేసినట్లు చరిత్ర చెబుతోందన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచిన ఆయన మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.
బైట్:
విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు.

Posted Under AP
Editor