రాయదుర్గం, జూలై 17
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై గత వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన రాజకీయ ప్రేరేపిత కేసులు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతున్నాయని, ఇక మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనపై ఉన్న సీబీఐ కేసులపై ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
శుక్రవారం రాయదుర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చంద్రబాబు నాయుడు నిజాయితీకి మరో నిదర్శనమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రజాప్రయోజనం లేదని, అది పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో దాఖలైనదేనని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
రాజకీయ కక్షసాధింపునకు చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకత్వానికి గట్టి హెచ్చరిక అని కాలవ అన్నారు. 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు నాయుడుపై 22 కేసులు నమోదు చేశారని, వాటిలో ఎనిమిది కేసులను సీఐడీ ద్వారా రాజకీయ దురుద్దేశంతో పెట్టించారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్‌మెంట్, ఉచిత ఇసుక విధానం వంటి అంశాల్లో నమోదైన కేసులు న్యాయస్థానాల్లో నిలవలేకపోయాయని చెప్పారు. మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణపై కూడా ఇదే తరహాలో కేసులు బనాయించారని విమర్శించారు.
అదే సమయంలో జగన్‌మోహన్ రెడ్డి తనపై నమోదైన సీబీఐ కేసుల విచారణకు ఎందుకు పదేపదే వాయిదాలు కోరుతున్నారని కాలవ ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణను ఎదుర్కొనే ధైర్యం లేకనే కోర్టులకు హాజరుకావడం లేదని విమర్శించారు. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదంటే సీబీఐ కోర్టు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని నిలదీశారు.
చంద్రబాబు నాయుడు నిష్ట, నిబద్ధత, పారదర్శకతతో ప్రజాసేవ చేసిన నాయకుడని, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే రాజకీయ కక్షతో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిరాధార కేసులు నమోదు చేసిందని కాలవ ఆరోపించారు. కోర్టు తీర్పులు సత్యం చివరికి గెలుస్తుందనే విషయాన్ని మరోసారి నిరూపించాయని పేర్కొంటూ, జగన్ తనపై ఉన్న సీబీఐ కేసులపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
