కేతన్ హత్య కేసులో సంచలనం: “మాకు ఇది వరకే పెళ్లయిపోయింది” అన్న నిందితులు!

మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలను వెల్లడించారు. తాము రాజస్థాన్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాటూ శ్యామ్ ఆలయంలో ఇదివరకే రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వారు క్లెయిమ్ చేశారు. నిందితులు చెప్పిన ఈ మాటల్లోని నిజానిజాలను నిర్ధారించుకోవడానికి పూణే రూరల్ పోలీసుల ప్రత్యేక బృందం బుధవారం నేరుగా రాజస్థాన్‌కు చేరుకుంది.

ఆలయ ప్రాంగణంలో నిజంగానే వివాహం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి పూణే పోలీసులు ఖాటూ శ్యామ్ ఆలయ యాజమాన్యాన్ని సంప్రదించి, ఆ నిర్దిష్ట రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే, అక్కడ ఎలాంటి సీసీటీవీ ఆధారాలు లభించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ పెళ్లి విషయమై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అంతా కొనసాగుతున్న విచారణలో భాగమేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గురువారంతో వీరి కస్టడీ గడువు ముగియనుండటంతో పోలీసులు వీరిని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు, కొడుకును కోల్పోయిన దుఃఖం నుంచి తేరుకోలేకపోతున్న మృతుడి తల్లి రాఖీ అగర్వాల్.. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఆవేదనతో కూడిన లేఖ రాయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడి హత్య కేసులో ప్రధాని వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని కఠిన శిక్ష పడేలా చూడాలని, తనకు న్యాయం చేయాలని ఆమె అందులో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దారుణ షాక్‌ను తట్టుకోలేక కేతన్ తాతగారు కూడా మూడు వారాల వ్యవధిలోనే మరణించారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, తమకు న్యాయం చేయాలంటూ కేతన్ తండ్రి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.

Editor