కూటమి పాలనపై విషం చిమ్మే వైకాపాను తరిమికొడదాం : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.
కూటమి పాలనపై నిరాధార ఆరోపణలతో విషం చిమ్ముతున్న వైకాపాను రాష్ట్రం నుండి తరిమికొట్టాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించేందుకు అనంతపురం పట్టణంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. “నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరుగుతుంది” అన్నట్లు వైసిపి అసత్య ప్రచారానికి పాల్పడుతొందన్నారు. అందుకే రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం కూటమి పార్టీల్లో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియ పై వైకాపా నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్ల పాలనలో విద్య, వైద్యం, పోలీసు తదితర విభాగాల్లో 30 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించగలిగామని, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 26శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయన్నారు. పెట్టుబడుల సాధన కోసం ప్రపంచ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచేలా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో కూటమి పాలనపై సంతృప్తి, విశ్వాసం పెరుగుతోందన్నారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ బీసీలు, దళితులు, మైనారిటీలకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తూ ముందుకు సాగుతున్న రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పం, మంత్రి నారా లోకేష్ బాబు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలసి రాష్ట్రాన్ని వేగవంతమైన అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రం బలమైన శక్తిగా ఎదగడానికి ఈ నలుగురు నాలుగు స్తంభాలుగా నిలుస్తున్నారన్నారు. అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమన్వయంతో అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉండాలన్నారు. కూటమి నాయకులు ఐకమత్యంతో సమిష్టిగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయభేరి మోగించాలని ఎమ్మెల్యే కాలవ పిలుపునిచ్చారు.
