అనంతపురం జిల్లా రాయదుర్గం
ఖరీఫ్ లో మెరుగైన దిగుబడులే లక్ష్యం: అధికారులతో ఎమ్మెల్యే కాలవ
ప్రస్తుత ఖరీఫ్ లో ఎల్ నినో ప్రభావం వల్ల ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన పంట దిగుబడులు సాధించేలా పంటల సాగు విధానంలో రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, సలహాలు సకాలంలో ఇవ్వాలని వ్యవసాయ సిబ్బందిని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. రాయదుర్గం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఖరీఫ్ సాగు పై గురువారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందేలా చూడాలన్నారు, ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ముఖ్యంగా వేరుశనగకు ప్రత్యామ్నాయంగా కంది, ఆముదం సాగు వైపు రైతులు ముగ్గు చూపుతున్నారని, వీటితో పాటు ఉలవ, కొర్ర పంటలను ప్రోత్సహిస్తూ తగిన సాంకేతిక సలహాలు ఇవ్వాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పండించే పంటల విషయంలో సకాలంలో అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తే, అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుందన్నారు. బొమ్మనహల్ , కనేకల్ మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నందున యూరియా కొరత రాకుండా ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలతో నివేదికలు పంపాలన్నారు. రైతు సేవా కేంద్రాలు, రైతు సహకార పరపతి సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలు అధిక మోతాదులో పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. సబ్సిడీ విత్తనాల విషయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి రైతు ఏ రకం పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో తప్పనిసరిగా వాటి వివరాలు ఈ క్రాపింగ్ లో పొందుపరచాలన్నారు. ప్రభుత్వం ద్వారా రైతులకు అందే రాయితీలు, ఇతర సహాయం అర్హులైన వారికి అందించాలన్నారు. నియోజకవర్గంలో వివిధ పంటల సాధారణ సాగు విస్తీర్ణం లెక్కల్లో తేడాలున్నాయని, వీటిపై దృష్టి పెట్టి నివేదికలు సరిచేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. తదనుగుణంగా అవసరమైన విత్తనాలు, ఎరువుల ప్రతిపాదనలు పొందుపర్చాలని ఆదేశించారు. వర్ష భావాన్ని తట్టుకొనే పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల రైతుకు పంట నష్టాలు తగ్గి, మెరుగైన ఫలితాలు అందుతాయని సూచించారు. పంటలకు సోకే తెగుళ్ల విషయంలో రైతులకు సకాలంలో మెరుగైన సూచనలు, సలహాలు ఇస్తూ పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పద్మజ, నియోజకవర్గ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొన్నారు.
