నిడిగల్లులో చెరువు భూములపై దురాక్రమణ ఆరోపణలు…

నిడిగల్లులో చెరువు భూములపై దురాక్రమణ ఆరోపణలు
చెరువును కాపాడాలని గ్రామస్తుల డిమాండ్ – అధికారులకు ఫిర్యాదు
తాడిమర్రి, జూన్ 8: తాడిమర్రి మండలంలోని నిడిగల్లు గ్రామంలో చెరువు భూములు దురాక్రమణకు గురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు మారినేని చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ వెంకటనాయుడు తదితరులు సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
వారి కథనం ప్రకారం, దాదాపు 40 నుంచి 50 ఎకరాల మేర చెరువు పరిధిలో ఉన్న భూమిని బత్తలపల్లి మండలంలో పశువైద్యాధికారిగా పనిచేస్తున్న గురునాథ్ రెడ్డి కొనుగోలు చేసినట్లు చెబుతూ జేసీబీలు, ట్రాక్టర్లతో భూసమతలీకరణ పనులు ప్రారంభించారని తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను నిలిపివేయించారని చెప్పారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, చెరువు భూములు ప్రభుత్వానికి చెందినవని, 1972లో ల్యాండ్ సీలింగ్ చట్టం అమలులో భాగంగా మారినేని కుటుంబ సభ్యులు ఈ భూములను ప్రభుత్వానికి అప్పగించారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం చెరువు విస్తీర్ణంలో భాగంగా కొనసాగుతోందని తెలిపారు. వర్షపు నీరు, కాలువల ద్వారా వచ్చే నీరు ఈ ప్రాంతంలో నిల్వ ఉండటం వల్ల గ్రామానికి, వ్యవసాయ భూములకు ఉపయోగపడుతోందన్నారు.
చెరువు భూములు కోల్పోతే నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో గ్రామంలో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వందలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించే ఈ చెరువు, మూగజీవాలు, పశుపక్షులకు కూడా నీటి వనరుగా ఉందని పేర్కొన్నారు.
ఈ అంశంపై స్థానిక ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి కూడా విషయం తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
చెరువు భూములను రక్షించేందుకు జిల్లా అధికారులు వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామస్తులు మాలినేని చంద్రశేఖర్ గోనుగుంట్ల వెంకట్ నాయుడు ఆ దెప్ప నాగప్ప ఫీల్డ్ అసిస్టెంట్ నరేస్ తదితర గ్రామస్తులుకోరారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిడిగల్లు చెరువును పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Posted Under AP
Editor