అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
వెట్టి చాకిరి నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: ఆర్డీవో వసంత బాబు
కళ్యాణదుర్గం, జూన్ 6: వెట్టి చాకిరి (బానిస కార్మిక వ్యవస్థ) నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇందుకోసం సంబంధిత చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కళ్యాణదుర్గం ఆర్డీవో జి. వసంత బాబు పేర్కొన్నారు.
శనివారం ఆర్డీవో కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం–1976 అమలుపై బాండెడ్ లేబర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని అప్పుల పేరుతో వ్యక్తులను బలవంతంగా వెట్టి చాకిరి చేయించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం, రెవెన్యూ, పోలీసు, కార్మిక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. సమాజంలో ఇటువంటి అమానవీయ పోకడలను పూర్తిగా నిర్మూలించేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వెట్టి చాకిరికి గురైన బాధితులు ఎటువంటి భయం లేకుండా పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో డీఎస్పీ రవి బాబు, ఇన్చార్జి డీఎల్డీఓ కొండన్న, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మోహన్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
