అనంతపురం జిల్లా, రాయదుర్గం.
విద్యుత్ షాక్తో తండ్రీకొడుకుల మృతి…. ఒకరికి గాయాలు
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కరిసూరయ్యదొడ్డి గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్డబ్ల్యూఎస్ మోటర్ మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్కు గురై మెకానిక్లు తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన మెకానిక్ ఆనంద్ (48), ఆయన కుమారుడు తేజ (24)ను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మోటర్ మరమ్మత్తుల కోసం పిలిపించారు. ట్రాక్టర్ సహాయంతో మోటార్ పైపులను బయటకు తీస్తున్న సమయంలో పైభాగంలో ఉన్న విద్యుత్ మెయిన్ తీగలు తగలడంతో విద్యుత్ ప్రవహించి ఇద్దరూ తీవ్ర షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.
అదే ప్రమాదంలో శిరిగేదొడ్డి గ్రామానికి చెందిన రేవన్న కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఆయనను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాలను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బొమ్మక్కపల్లి గ్రామస్థులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న , గుమ్మఘట్ట ఎస్సై చిన్నరాయుడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గుమ్మఘట్ట, రాయదుర్గం మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నన్న, హనుమంతు తదితరులు అధికారులతో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కోరారు. గుమ్మఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తండ్రి, కుమారుడు ఒకేసారి మృతి చెందడంతో రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆనంద్కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. బోర్లు, చేతిపంపుల మరమ్మత్తులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కుటుంబానికి ఆధారమైన ఆనంద్, ఆయన కుమారుడు తేజ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
